భూనిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : ఎమ్మెల్యే గడ్డం వినోద్​

భూనిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : ఎమ్మెల్యే గడ్డం వినోద్​

కాసిపేట, వెలుగు: మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్​కాస్ట్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోపోయిన నిర్వాసితులకు అన్నిరకాల వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్​ అన్నారు. గురువారం కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలోని ఆర్అండ్ఆర్​ కాలనీలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాలనీలో వాటర్​ ట్యాంక్, ప్రభుత్వ స్కూల్, దేవాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్మిస్తామని, అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

 కొత్త కాలనీలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సింగరేణి అధికారులు పకడ్బందీగా పనులు చేయాలని ఆదేశించారు. సర్వే చేసి భూములు నష్టపోయిన మరికొందరికి కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మందమర్రి ఏరియా జనరల్ ​మేనేజర్​ దేవేందర్​కు సూచించారు. ఈ సందర్భంగా 299 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, అధికారులు పాల్లొన్నారు.

జీవో 58, 59 ప్రకారం అందరికీ పట్టాలు ఇవ్వాలి

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని సీపీఐ నేతలు కోరారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ టౌన్ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, నేతలు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. జీవో 76 ద్వారా కొందరికి మాత్రమే పట్టాలు ఇచ్చారని, జీవో 58, 59 ప్రకారం పాత సింగరేణి క్వార్టర్స్​లో నివసిస్తున్నవారందరికీ ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, పారిశుద్ధ్య లోపాలపై చర్యలు తీసుకోవాలని, డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చాలని, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా రక్షించాలని కోరారు. సీపీఐ మండల సెక్రటరీ లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశం, రాజేశ్, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.