కాకా వెంకటస్వామి కాలనీ పేరుతో భూదందాలకు పాల్పడ్డవారిని వదిలిపెట్టం : గడ్డం వినోద్

  •     మా తండ్రి పేరును బద్నాం చేస్తే ఉపేక్షించం
  •     బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో కొంతమంది కాకా వెంకటస్వామి ఇందిరమ్మ కాలనీ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్మకాలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, వారిని వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హెచ్చరించారు. బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి మచ్చ లేని రాజకీయ నేతగా పేరున్న మా మండ్రి  కాకా పేరును ఎవరైనా అక్రమాలకు  వినియోగిం చితే ఉపేక్షించేది లేదన్నారు. 

బెల్లంపల్లి పట్టణం లోని కన్నాల హైవే, పెద్దబూద ఇందిరమ్మ కాలనీల్లో ఉన్న ప్రభుత్వ భూములు కొందరు కబ్జాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్న కథనాలను కొలమానంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బెల్లంపల్లిలో జరుగుతున్న భూ కబ్జాలపై పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి అరికట్టాలని ఆదేశించారు. ఇందుకు అధికారులకు తాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. హోదాను, ప్రోటోకాల్​ను విస్మరించి కొందరు తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని.. అలాంటివారు సాక్ష్యాధారాలతో ముందుకు రావాలని సవాల్ చేశారు. 

ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామనిచెప్పారు. సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, ఆర్డీఓ  పి.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.