
బెల్లంపల్లి, వెలుగు: వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్లో చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ మీటింగ్కు ఎమ్మెల్యే వినోద్ హాజరయ్యారు. పట్టణంలోని 34 వార్డుల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. దోమల తీవ్రత పెరగకుండా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రజలు దోమలు, ఈగల బారిన పడకుండా అన్ని వార్డులకు 4 స్ప్రేయింగ్ మెషీన్లు కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొందరు కౌన్సిలర్లు తమ ఇండ్లలో పనులు చేయించుకుంటూ తమపై పని భారం మోపుతున్నారని బెల్లంపల్లి మున్సిపల్ శానిటరీ సిబ్బంది ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి సమస్యను విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
మున్సిపాలిటీలో కార్మికులను పెంచాలని
మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దీపక్ కుమార్ ను ఎమ్మెల్యే వినోద్ కలెక్టరేట్లో కలిశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ కార్మికులను పెంచాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.