బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా : గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు :  బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు.  మంగళవారం చైర్‌‌‌‌పర్సన్‌‌ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాజకీయాలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.   వార్డుల్లో నెలకొన్న సమస్యలపై తనకు చెప్పాలని ప్రతి సమస్య పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానన్నారు.

అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ.. బెల్లంపల్లి అభివృద్ధిని చైర్‌‌‌‌పర్సన్‌‌ శ్వేత ఏనాడు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి కాంగ్రెస్‌‌ లో చేరిన ఆమె ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కమిషనర్ రత్నం భుజంగరావు, మున్సిపల్ ఏఈ సందీప్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.  

మున్సిపాలిటీ అభివృద్ధిని చైర్ పర్సన్‌‌ అడ్డుకుంటోంది

బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నాలుగేళ్లుగా చైర్ పర్సన్ జక్కుల శ్వేత చేసిందేమీ లేదని ఆమె మాటలు వినొద్దంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ 20 వ వార్డు కౌన్సిలర్ గోసిక రమేశ్  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాళ్లు మొక్కారు.  మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ సమావేశం మున్సిపల్ ఆఫీస్ లో జరిగింది.

 సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వినోద్ సమావేశం అనంతరం చైర్ పర్సన్ చాంబర్‌‌‌‌లోకి వెళ్లి బయటకు వచ్చారు.  అక్కడే నేలపై కూర్చున్న సదరు కౌన్సిలర్ రమేశ్‌‌ ఎమ్మెల్యే కాళ్లు మొక్కారు.  చైర్ పర్సన్ శ్వేత నాటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కూడా తప్పుడు మాటలు చెప్పి పట్టణం అభివృద్ధి కాకుండా చేశారని ఆరోపించారు.