బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. సోమవారం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని చెప్పారు.
బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కుమ్రంభీం ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు కాకుండా గోదావరి నుంచి బెల్లంపల్లికి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్రీధర్, ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, కౌన్సిలర్లు రాములు నాయక్, సురేశ్, రేణుక, నాయకులు రత్నం ప్రదీప్, బొలిశెట్టి సుధాకర్, మల్లేశ్, చిలుముల శ్రీనివాస్, జాడి స్వామి పాల్గొన్నారు.