తెలంగాణలో అతిపెద్ద స్కామ్ మిషన్ భగీరథ స్కీమ్: ఎమ్మెల్యే వివేక్

తెలంగాణలో అతిపెద్ద స్కామ్ మిషన్ భగీరథ స్కీమ్: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: మిషన్ భగీరథ స్కీమ్‎పై కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు చాలా గ్రామాల్లో రావట్లేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ స్కీమ్ రాష్ట్రంలో అతి పెద్ద స్కాం అని అన్నారు. మిషన్ భగీరథ స్కీమ్‎లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని.. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. మిషన్ భగీరథ పేరుతో కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారో తేలాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.42 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపడితే ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.

మిషన్ భగీరథ ద్వారా కాంట్రాక్టర్లే లబ్ధి పొందారని.. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ ఫెయిల్ అయ్యిందని.. దానికి ఆల్టర్నేటివ్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలో భూగర్జ జలాలు అడుగంటిపోయాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కాకా వెంకట స్వామి తెలంగాణకు ఏం చేశారని కేసీఆర్ అంటున్నారట.. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థకు లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడిందే కాకా వెంకట స్వామి అని కౌంటర్ ఇచ్చారు. 

ALSO READ | LRS గడువు పొడగించం.. త్వరలో భూ వ్యాల్యూ పెంపు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం (మార్చి 24) బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎకానమి గ్రోత్ రేట్ బాగుందని.. ట్రిలియన్ డాలర్ ఎకానమి వైపు వెళ్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్‎తో ముందుకు వెళ్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి గతం కంటే ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపారు. లిడ్ క్యాప్ ల్యాండ్ బ్యాంక్ మ్యానిటైజ్ చేయాలని సూచించారు. 

అలాగే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అద్భుతమని కొనియాడారు. దీని ద్వారా చాలా మంది యువత స్కిల్ డెవలప్ చేసుకుంటారని.. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని.. మెట్రో విస్తరిస్తే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. రూ.100 కోట్లతో కార్పొస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లలో బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.