రైతుల భూములు ఎటూ పోవు.. ఆందోళన చెందొద్దు

కామారెడ్డి, వెలుగు: డీటీసీపీ ఆఫీసర్లు, కన్సల్టెన్సీ తప్పిదం వల్లే  కామారెడ్డి ముసాయిదా ప్లాన్​పై గందరగోళం నెలకొందని  కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​గంప గోవర్ధన్​ అన్నారు.  శనివారం సాయంత్రం  ఆయన మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్​ తీర్మానం చేసి పంపిన ప్లాన్​ ఒకటయితే ,  డీటీసీపీ, కన్సల్టెంట్ వాళ్లు  మరొకటి   పంపారన్నారు.  ఈ తప్పిదాన్ని  మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తానన్నారు.  కొందరు లీడర్లు  రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, బాధ్యతగలవాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని  విమర్శించారు.  రైతుల భూములను లాక్కుంటున్నారని రెచ్చగొడుతూ వారిని రోడ్లపైకి తెస్తున్నారన్నారు.  అడ్లూర్, ఇల్చిపూర్,  టెకిర్యాల్​ శివార్లలో  600 ఎకరాలను రెసిడెన్షియల్​ జోన్​గా  ప్రతిపాదిస్తే  కన్సల్టెంట్​ సంస్థ  ఇండస్ర్టియల్​ జోన్​గా చూపెట్టిందన్నారు. కామారెడ్డి టౌన్​లో  3,412 ఎకరాల గవర్నమెంట్​ భూములున్నాయని, ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీయల్​ జోన్​ ప్రతిపాదించామని వివరించారు.  రామేశ్వర్​పల్లిలో గవర్నమెంట్​భూముల్లో గ్రీన్​జోన్, రిక్రియేషన్​ జోన్​ ప్రపోజల్స్​చేస్తే  ప్రైవేట్  భూములకు మార్చారన్నారు. మెయిన్​ రోడ్డుపై రద్దీ  నియంత్రించేందుకు  లింగాపూర్​ శివారు నుంచి  100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించామని,  సబ్​స్టేషన్​ వెనుక నుంచి లింగాపూర్​ రోడ్డు వరకు ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డుతో  రైతులకు చెందిన భూమి పోదన్నారు. లింగాపూర్​ మీదుగా    కామారెడ్డి చెరువు వరకు ప్రతిపాదించిన రోడ్డు వల్ల  కూడా  ఎవరికీ నష్టం లేదన్నారు.  అభ్యంతరాల స్వీకరణ తర్వాత అందరితో చర్చించి ఫైనల్​ మాస్టర్​ ప్లాన్​ పంపిస్తామన్నారు. రైతులు, మేధావులు, అన్ని వర్గాలతో మీటింగ్​ ఏర్పాటు చేస్తామన్నారు.   

బలవంతంగా రుద్దటం సరికాదు: కోదండరాం​

ప్రజల అభిప్రాయాల మేరకే మాస్టర్​ ప్లాన్లు తయారు చేయాలే కానీ బలవవంతంగా రుద్దటం మంచిది కాదని టీజేఎస్ ​స్టేట్​ ప్రెసిడెంట్ ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. మాస్టర్​ప్లాన్​తో నష్టపోతానని ఆత్మహత్య చేసుకున్న  అడ్లూర్​ ఎల్లారెడ్డి రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. రైతులు వ్యతిరేకిస్తున్న  మాస్టర్​ప్లాన్​ఉపసహరించుకోవాలని కోరుతూ కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​కు వినతిపత్రం అందించారు. మాస్టర్​ ప్లాన్​ తయారు చేయడంలోనే తప్పు  జరిగిందన్నారు.  ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తే కామారెడ్డిలో జరిగినట్లుగానే మిగతాచోట్ల కూడా జరుగుతుందన్నారు.    

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు:- కె.ఎ. పాల్​

కామారెడ్డి మాస్టర్​ప్లాన్ 10 రోజుల్లో మారిపోతుందని, రైతులెవరూ తొందర పడొద్దని ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్​ కె.ఎ. పాల్​అన్నారు.  శనివారం ఆయన కామారెడ్డిలో కలెక్టర్​ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.   ప్లాన్​ను రద్దు చేయకపోతే రైతుల పక్షాన తానే ధర్నాకు  దిగుతానన్నారు.   రైతులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దన్నారు. బండి సంజయ్​పై కేసు  మాస్టర్​ ప్లాన్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న  బీజేపీ చీఫ్​బండి సంజయ్​తో పాటు పలువురిపై కేసు నమోదైంది.  రైతుల ఆందోళనకు మద్దతుగా శుక్రవారం రాత్రి  బండి సంజయ్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసు వెహికల్​అద్దాలు ధ్వంసమయ్యాయి.  ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, ఆఫీసర్ల డ్యూటీకి ఆటంకం కలిగించటం వంటి ఆరోపణలపై బండి సంజయ్,   మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, కామారెడ్డి ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరుల మీద  దేవునిపల్లి పోలీస్​స్టేషన్​లో  కేసు నమోదు చేశారు. కోర్టుకెళ్లిన రైతులు ముసాయిదా మాస్టర్​ప్లాన్​లో  తమ భూములను రిక్రియేషన్​ జోన్​గా చూపెట్టడంపై రామేశ్వర్​పల్లికి చెందిన ఐదుగురు  రైతులు హైకోర్టుకు  వెళ్లారు. 40 ఎకరాను రిక్రియేషన్​ కింద చూపడాన్ని సవాల్​ చేశారు.  ముసాయిదా మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా శనివారం  పాతరాజంపేట రైతులు ఆందోళన చేశారు. మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి కమిషనర్​కు వినతిపత్రం అందించారు.