కన్సల్టెన్సీ, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ తప్పిదం వల్లే పొరపాటు : గంపగోవర్ధన్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ క్లారిటీ ఇచ్చారు.  ఇండస్ట్రియల్‌ జోన్‌ ను ప్రభుత్వ భూముల్లోకి మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ ను కూడా ప్రభుత్వ భూముల్లోకి  మారుస్తామని తెలిపారు. కన్సల్టెన్సీ,  డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కౌంట్రీ ప్లానింగ్ వల్లే  ఈ తప్పిదం    జరిగిందన్నారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదన్నారు. గందరగోళానికి కారణమైన డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.  అభ్యంతరాలను తీసుకుని ఈ నెల 11 తర్వాత రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ పై కొన్ని రాజకీయ పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏ రైతుకు అన్యాయం జరగదని.. రైతులకు అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి  లేదని చెప్పారు.  రైతుల నుంచి గుంట భూమి కూడా తీసుకోబోమన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని..ప్రజలకు వ్యతిరేకంగా మున్సిపల్ తీర్మానం ఉండబోదని స్పష్టం చేశారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో 7 గ్రామాలు విలీనం అయ్యాయని గంప గోవర్దన్ చెప్పారు. విలీనం తర్వాత మున్సిపాలిటీ విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రతి 20 ఏళ్ల కోసారి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల భూములు పోతున్నాయని..అందుకే రైతులను భయపెడుతున్నారని అన్నారు.  ముసాయిదా డ్రాఫ్ట్ విషయంలో రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు రాజకీయ డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. అన్ని చర్చించి కౌన్సిల్ లో పెట్టిన తర్వాత ప్రభుత్వానికి పంపుతామన్నారు.