శాయంపేట, వెలుగు: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. ఈ నెల 26న ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోస, రేషన్ కార్డుల పంపిణీ పథకాలపై నిర్వహిస్తున్న సర్వేను శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో ఎమ్మెల్యే పరిశీలించారు.
సర్వే షెడ్యూల్ వివరాలు తనకు ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీవో ఫణిచంద్రను ప్రశ్నించారు. సర్వేలో కొత్తగా అప్లికేషన్స్ ఎందుకు సేకరించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీడీవోపై కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు శాయంపేట రైతు వేదికలో నేషనల్ కన్స్ట్రక్షన్ అఫ్ ఇండియా(ఎన్ఏసీ) సహకారంతో ప్రజ్వల్ సంఘం నిర్వహణలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసి, శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రషర్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మూసివేయిస్తే మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌తో క్రషర్యజమానులు నడిపిస్తున్నారని వాటిని త్వరలో కోర్టు నుంచి వెకేట్ చేయించి పర్మినెంట్‌గా మూసివేయిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఏవో గంగా జమున, ఎంపీవో రంజిత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.