జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రకటించారు. ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్‌బాబు ఈ పార్క్‌కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపారు. ఈ పార్క్ ద్వారా వేలాది మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మంగళవారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగాలిప్పిస్తామని తన పేరు చెప్పి పైసలు వసూలు చేస్తే కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజకవర్గంలో 124 చెరువులను రూ.51 కోట్లతో మరమ్మతులు, రూ.140 కోట్లతో పాఠశాలల్లో పనులు చేశామన్నారు.భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ స్కీంలో ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
భూపాలపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కోసం ఇటీవల కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనలు పంపించారన్నారు. మొదటి దశలో ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఎలిజిబిలిటీ లేని వాళ్ల పేర్లను తొలగిస్తామన్నారు. వారం రోజుల్లో మరో 430 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిరుపేదలకు అందచేస్తామని ప్రకటించారు.