- రూ. కోటి 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భూపాలపల్లి అర్భన్, వెలుగు: భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఎమ్మార్వో రోడ్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఫేజ్ - 5 కింద సుమారు రూ.కోటి40 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు జడ్పీ సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు.
రూ.30 లక్షలతో కారల్ మార్క్స్ కాలనీలో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా, రూ. 50 లక్షలతో పోలీస్ స్టేషన్ రోడ్డులో రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డులో బీటీ రోడ్డు వైడనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.