మొగుళ్లపల్లి, వెలుగు: ‘మీకు ఎందుకంత నిర్లక్ష్యం.. బాధ్యత లేదా? జీతం తీసుకుంట లేరా? ఏం తమాషా చేస్తున్నారా.. ఇంకెప్పుడు పనులు పూర్తి చేస్తరు’ అంటూ ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఆఫీసర్లపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీపీ సుజాత అధ్యక్షతన మండల సభ నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర హాజరై ఆఫీసర్ల పని తీరును సర్పంచులు, ఎంపీటీసీల ద్వారా తెలుసుకున్నారు. ఇంకా చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదని, పనులు అసంపూర్తిగానే ఉన్నాయని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 రోజుల్లో అన్ని గ్రామాల్లోని పెండింగ్పనులను పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారట్లేదని ఆఫీసర్లపై మండిపడ్డారు.
గోల్డ్ తాకట్టు పెట్టి శ్మశానం కట్టిన
ఆఫీసర్లు చెప్పిండ్రని ఒంటి మీది బంగారం తాకట్టు పెట్టి భూమి కొని శ్మశాన వాటిక కట్టానని, ఎన్ని లక్షలు ఇస్తే మేం తిన్నామని ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో ఎంపీడీఓ కృష్ణవేణిని ప్రశ్నించారు. మాకు నోటీసు ఎలా ఇస్తారని అడిగారు. పనులు చేసి ఏడాదైనా బిల్లు రాలేదని వాపోయారు. పై ఆఫీసర్ల ఆదేశాలతోనే నోటీసు ఇచ్చామని ఎంపీడీవో సమాధానమిచ్చారు. తహసీల్దార్ సమ్మయ్య, సింగిల్విండో చైర్మన్ నరసింగారావు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, ఆఫీసర్లు పాల్గొన్నారు.