ప్రభుత్వ హాస్పిటల్‌‌లో అన్ని వసతులు కల్పిస్తాం : గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి అర్బన్, వెలుగు : భూపాలపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్‌‌ భవేశ్‌‌ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. శుక్రవారం హాస్పిటల్‌‌లో ప్లేట్‌‌లెట్స్‌‌ వేరు చేసే మిషన్‌‌తో పాటు పేషెంట్ల బంధువులు వేచి ఉండే రూమ్‌‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నందున, పేషెంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్లేట్‌‌లెట్స్‌‌  వేరు చేసే మిషన్‌‌ ఉపయోగపడుతుందన్నారు. అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ వెంకట్రాణి సిద్దు, మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ లక్ష్మీ నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ రమేశ్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లిలోని జంగేడు స్టూడెంట్లకు భవిష్యత్‌‌ లక్ష్యాల గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్‌‌, డాక్టర్లతో పాటు వివిధ రంగాల్లో విజయం సాధించిన వారితో ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం భూపాలపల్లి సర్కార్‌‌ స్కూల్‌‌లో స్టూడెంట్లకు బ్రేక్‌‌ఫాస్ట్‌‌ అందజేశారు. 

వ్యవసాయానికి ప్రభుత్వం అండ

రేగొండ, వెలుగు : వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట, సుల్తాన్‌‌పూర్‌‌లో సైడ్‌‌ డ్రైనేజీలు, సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గోరికొత్తపల్లిలో తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు భూమిపూజ చేశారు.