కరీంనగర్ టౌన్, వెలుగు: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ శ్రేణులు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరించి సిటీలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. నీళ్లు, కరెంట్ లేవన్నారు.
ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, ఎవరూ ఖతం చేయలేరని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
కేసీఆర్ సీఎంగా లేకపోవడం బాధగా ఉంది
రాజన్నసిరిసిల్ల, వెలుగు: కేసీఆర్ సీఎంగా లేకపోవడం బాధగా ఉందని మానకొండూర్ మాజీ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ ముగింపు వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆనాడు జై తెలంగాణ అంటే నక్సలైట్ ముద్ర వేశారని, కేసీఆర్ పిలుపుతోనే తాను ఉద్యమంలో చేరానన్నారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్లు మాధవి, జిందం కళా పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్, వెలుగు: సోమవారం జగిత్యాలలోని పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఎంసీహెచ్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వసంత పాల్గొన్నారు.