కరీంనగర్, వెలుగు: పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచి పూరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న సిటీలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభ స్థల ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి బి.వినోద్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్ అని గుర్తు చేశారు. అందుకే ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమవుతుందని ఆయన నమ్ముతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజలకు విసుగొచ్చిందన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిటీ అధ్యక్షుడు హరిశంకర్, కార్పొరేటర్లు ఐలెందర్ యాదవ్, మహేశ్, వెంకటేశ్వర్ రావు, లీడర్లు అనీల్ గౌడ్, రవీందర్ రెడ్డి, డాక్టర్ అమిత్ కుమార్, జమీలుద్దీన్ పాల్గొన్నారు.
బహిరంగ సభను సక్సెస్ చేయాలి
కొడిమ్యాల, వెలుగు: ఈనెల 12న కరీంనగర్ లో జరిగే పార్లమెంటు స్థాయి బహిరంగ సభను పార్టీ శ్రేణులు సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్ లో కరీంనగర్ కదనభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతితోపాటు పలువురు లీడర్లు సమావేశానికి హాజరు కాకపోవడం మండలంలో చర్చనీయాశంగా మారింది.