కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే డెవలప్ అయిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం సిటీలోని కిసాన్ నగర్‌లో వాకర్స్‌తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016లో ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్ కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా వచ్చేలా కృషి చేశారన్నారు.
రూ.వేల కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేశారన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే, ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో భయం మొదలైంది
గంగాధర/ బోయినిపల్లి, వెలుగు : కేసీఆర్ పొలం బాట పట్టేసరికి కాంగ్రెస్‌లో భయం మొదలైందని, ఉద్దెర మాటలు.. అడ్డగోలు అబద్ధాల హామీలతో రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. గంగాధర మండలం మధురానగర్‌లో బుధవారం ఆయన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. ఇన్ని రోజులు నీళ్లు లేవన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే గాయత్రీ పంప్‌హౌస్‌లో మోటర్లు ఎలా ప్రారంభించారన్నారు. అంతకుముందు బోయినిపల్లి మండలంలోని మిడ్‌మానేరులో నీరు తగ్గిపోయి, బయటపడుతున్న గ్రామాలను కొదురుపాక బ్రిడ్జిపై నుంచి వినోద్‌కుమార్ పరిశీలించారు.