యాదాద్రి, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆఫీసర్లపై సీరియస్అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే శంకుస్థాపన చేసిన పనులను ఆపడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేసి బదిలీ చేయిస్తానని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కూరెళ్లలో కల్లూరి రాంచంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్3న శంకుస్థాపన చేసిన పనులను నిర్వహించకుండా ఆఫీసర్లు ఆపుతున్నారని పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ లీడర్లు కంప్లయింట్చేయడం వల్లే ఆఫీసర్లు ఆపుతున్నారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆఫీసర్లను ఉద్దేశించి పై విధంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్అక్టోబర్9న వచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్నారు. లేకపోతే తానే కంప్లయింట్ఇచ్చి బదిలీ చేయించి పనులు చేయిస్తానని స్పష్టం చేశారు.