- మంత్రి కోమటిరెడ్డిని కోరిన ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, వెలుగు : పటాన్చెరు నియోజకవర్గంలో రహదారులను విస్తరించడంతోపాటు, మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని ఇందుకోసం రూ. 84 కోట్లు కేటాయించాలని, పటాన్చెరు నుంచి ఇంద్రేశం, పెద్ద కంజర్ల మీదుగా బేగంపేట వరకు రహదారి విస్తరణకు రూ.56 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.