సూర్యాపేట, వెలుగు : నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండాలో నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ని వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలకు మోసపోయామని ప్రజలు వాపోతున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను పక్కన పెట్టి కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ నాయక్, పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఉట్కూరి సైదులు, సత్యం, గోవిందరెడ్డి, బాలాజీ నాయక్, అనిల్ నాయక్ పాల్గొన్నారు.