నల్గొండ అర్బన్, వెలుగు : పదవులను కాపాడుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్యం కేసీఆర్, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టమొ చ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారం చేసిన దళారులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని విమర్శించారు.
అన్నదాతలను మోసం చేసి సాగర్ నీళ్లను ఆంధ్రా అమ్మి.. అప్పటి సీఎం వైఎస్సార్వద్ద కోమటిరెడ్డి బ్రదర్స్ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉంటూ మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పట్టిన శని కోమటిరెడ్డి బ్రదర్స్ అని, వాళ్లు మాట మీద నిలబడేవారు కాదన్నారు.
కేసీఆర్ వైట్ పేపర్ లాంటివారని, మీ జీవితాంతం వెతికినా కేసీఆర్ పై మచ్చ చూడలేరన్నారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని, గుజరాత్ మోడల్ అంటే బెదిరింపులు, లైంగికదాడులు, అక్రమాలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనన్నారు. తాను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఆయన వెంట జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు మొదటి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్ యాదవ్, మాల శరణ్యరెడ్డి, కరీం పాషా, కొండూరు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.