తీరు మార్చుకోకపోతే నీ అంతు చూస్తా.. ఉప సర్పంచ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

అచ్చంపేట; వెలుగు: ఫ్లెక్సీల్లో తన ఫొటో పెట్టనీయలేదంటూ కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఉపసర్పంచ్​ను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బెదిరించారు.  ‘ నీ తీరు మార్చుకోకపోతే అంతు చూస్తా’ అంటూ వార్నింగ్​ ఇచ్చారు. ఉప సర్పంచ్ కథనం ప్రకారం..బల్మూర్ ​మండలం జినుకుంటలో ఈ నెల 25న ఓ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కాకుండా కేవలం దేవుడి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అయితే, కొందరు బీఆర్ఎస్​ నేతలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై సోమవారం ఉప సర్పంచ్ కృష్ణయ్యకు గువ్వల బాలరాజు ఫోన్​ చేశారు. ‘ఏ కొడుకు నా ఫ్లెక్సీ వద్దనేది? రికార్డు చేస్తున్నవా చేస్కో..పోనియ్​ వైరల్​ కానియ్​..నీ వైఖరి మారుతనేమో మంచిది. లేకపోతే బాగుండదు. మేమేమన్నా దొంగలమా? నా ఫొటో పెట్టనియ్యవారా? ఆ రోజు కూడా చూసిన నీ బిల్డప్​లు..నీ పోజులు..నేను కింద నిలవడితే..నవ్వుకుంట..ఎక్కిరించినట్టు మొతబరిలాగ ఉంటవా?  అంత రుబాబా రా... దేవునికాడ కాదు దేవున్ని ఆనుకునే ఫ్రేం పెట్టి ఫ్లెక్సీ కడతా..ముట్టుకో చూస్తా’ అని బెదిరించారు.   

పోలీసుల అదుపులో ఫ్లెక్సీల షాపు ఓనర్​ .. 

ఫ్లెక్సీలు ప్రింట్​ చేయలేదని షాప్​ ఓనర్​ను అచ్చంపేట పోలీసులు పట్టుకుపోయి కొట్టారని తెలుస్తోంది .మంగళవారం మంత్రి పర్యటన ఉండగా ఫ్లెక్సీలు తయారు చేయించాలని టౌన్​లోని ఆర్ఎస్​ డిజిటల్స్ ఫ్లెక్సీ బ్యానర్స్ ​షాప్​కు సోమవారం కొందరు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. ఆ టైంలో ఓనర్​ మహేశ్​ లేకపోవడంతో పని చేసేందుకు వర్కర్స్​ నిరాకరించారు. దీంతో సోమవారం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన మహేశ్ ను పోలీసులు స్టేషన్​కు తీసుకువెళ్లి కొట్టినట్టు తెలిసింది. మహేశ్​ కుటుంబసభ్యులు, కొందరు లీడర్లు పీఎస్​కు వెళ్లి ఎస్ఐతో మాట్లాడగా ఎమ్మెల్యేను తిట్టినందుకే మహేశ్​ను తీసుకువచ్చినట్లు చెప్పారు. తర్వాత అర్ధరాత్రి వేళలో వదిలేశారు. ఈ విషయంపై ఎస్ఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.