
- ప్రశ్నాపత్రాలు లీకైనట్టు అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ చేశారు
- ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే సర్కారు చోద్యం చూస్తున్నది
- బీఏసీ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ఎల్పీలో చిట్ చాట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు కనీసం 20 రోజులైనా నడపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రశ్నపత్రాలు లీకైనట్టు అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవ్వడం దారుణమని, దానిపై అభ్యంతరం తెలిపామని చెప్పారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం అనంతరం బీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో బుధవారం చిట్‌చాట్ చేశారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దంటూ సీఎం స్పీకర్‌ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. ‘‘సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడేందుకు టైమ్ ఇవ్వాలని బీఏసీలో కోరాం.
సుంకిశాల, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోవడం, ఎస్ఎల్ బీసీ ప్రమాదం వంటి ఘటనలపై అసెంబ్లీలో చర్చించాలి. మంత్రులు కూడా సభకు ప్రిపేర్ అయి రావాలి. కృష్ణా నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దానిపై సభలో చర్చించాలి. ఏపీ సర్కార్ నీళ్లు తరలించుకుపోతుంటే.. తెలంగాణ సర్కారు చోద్యం చూస్తున్నది. బిల్లుల చెల్లింపులకు 20 శాతం కమీషన్ అడుగుతున్నారు. దానిపై అసెంబ్లీలో చర్చించాలి. ఆరు గ్యారంటీలు, ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే దాన్ని పునరుద్ధరించాలి’’అని హరీశ్ అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో దశదిశ ఏమీ లేదు
గవర్నర్లు మారారే తప్ప.. ప్రసంగం మాత్రం మారలేదని హరీశ్ రావు అన్నారు. గవర్నర్ ప్రసంగంలో దశాదిశ ఏమీ లేవని విమర్శించారు. ‘‘సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేవు. ఏడాదిన్నర పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగమే నిదర్శనం. చేయనివి చేసినట్లు, ఇవ్వనివి ఇచ్చినట్టుగా గవర్నర్‌తో రాష్ట్ర సర్కారు అబద్ధాలు చెప్పించింది. రేవంత్ అబద్ధాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్‌నూ వాడుకోవడం సిగ్గుచేటు. ‘నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే’ అన్న గాంధీ మాటలను ప్రసంగంలో పెట్టారు. కానీ, రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నమవ్వడమేనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు’’అని హరీశ్ అన్నారు.
సమ్మిళిత అభివృద్ధి అంటే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి అని, కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, ఢిల్లీ డెవలప్మెంట్ కాదని విమర్శించారు. 20 శాతం కమీషన్లు తీసుకోవడమే సమ్మిళిత అభివృద్ధా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ తన రాజకీయ విమర్శలకు వాడుకున్నారని హరీశ్ విమర్శించారు. ‘‘కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామకపత్రాలిస్తూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటారు? కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ల పోస్టులకు పెట్టిన పరీక్షలకే ఇప్పుడు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు’’అని హరీశ్ అన్నారు.