హైదరాబాద్, వెలుగు: ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇది బేకార్ సర్కార్ అని ప్రజలు అనుకుంటున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మంచి ఆర్థిక వృద్ధితో అప్పగిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆశించినంత వృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ‘‘నీ అపరిపక్వత.. నీ అసమర్థత.. నీ ప్రతికూల వైఖరితో రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో వెనుకబడింది.
వృద్ధి రేటు పెంచే సత్తా లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ములేదు. అప్పులన్నీ బహిరంగ రహస్యమే. ఏ ప్రభుత్వమూ దాచే అవకాశమే లేదు. ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లోనూ ఆ వివరాలు ఉంటాయి. నీ పేరే ఎగవేతల రేవంత్ రెడ్డి’’అని విమర్శించారు.