
సిద్దిపేట, వెలుగు : తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్అని, ఇది తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం హౌజింగ్ బోర్డు కమాన్ వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి ఆదాయం మందగించిందన్నారు. ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, కాంగ్రెస్ సర్కార్ ది గతి లేని.. శృతి లేని సంసారం అని ఎద్దేవా చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్దిపేట పేరంటేనే ఓర్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ 420 హామీల అమలు కోసం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది గులాబీ జెండేనని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మాది ఎప్పుడూ ప్రజల పక్షమేనని
చెప్పారు.
పోచమ్మ గుడివద్ద కేపీఆర్..
ప్రశాంత్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ జెండావిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధరణను కోల్పొయిందని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.