మెదక్: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తూ.. రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మార్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 23) నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు.. ఆమె నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. గోమారంలో సునీతా రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను ఆరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ALSO READ | ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫోన్ చేసి చెప్పానన్నారు. గొడవ జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిని కుడా తక్షణమే అరెస్ట్ చేయాలని.. లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. ఇవాళ సునీత రెడ్డి నివాసంపై దాడి జరిగిందని.. కాంగ్రెస్ గుండాల నుండి తెలంగాణ రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతిననివ్వమని పునరుద్ఘాటించారు.