పాలమూరు వలసల పాపం.. ఆ రెండు పార్టీలదే: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అని తెలిపారు. రేవంత్ తిట్టాల్సి వస్తే.. తన గురువు చంద్రబాబును తిట్టాలని అన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనని.. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని.. తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు హరీష్ రావు. 

సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. మరికొద్ది రోజుల్లో  పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి లోక్​సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేందుకు అంతా కృషి చేయాలని ఆయన సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో అమలు పరచాల్సిన ప్రణాళిక, వ్యూహం గురించి మార్గనిర్దేశం చేశారు. 

కేంద్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక్కడ హామీలు అమలయ్యేది లేదని విమర్శించారు. 

రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్​ను గెలిపించాలనే విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.  రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి, ఆరున్నర లక్షల మంది రోడ్డున పడ్డారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటు వేయాలని హరీశ్ రావు కోరారు.