రైతు భరోసాపై కాంగ్రెస్ కుట్రలు .. డిక్లరేషన్‌‌‌‌ పేరుతో రైతన్నను అడుక్కునేలా చేస్తున్నరు

రైతు భరోసాపై కాంగ్రెస్ కుట్రలు .. డిక్లరేషన్‌‌‌‌ పేరుతో రైతన్నను అడుక్కునేలా చేస్తున్నరు
  • రైతు బంధును ఎగ్గొట్టి, రైతు భరోసాకు కొర్రీలు పెడుతున్నదని ఆరోపణ 
  • సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని మండిపాటు

సంగారెడ్డి, వెలుగు: రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌ రావు అన్నారు. అన్నం పెట్టే రైతన్నలను అడుక్కునేలా చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసాని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఎగ్గొట్టారని, మరోవైపు రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారన్నారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హరీశ్‌‌‌‌ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేనట్టు ఏదేదో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు మర్చిపోయాడు. 

కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్న ప్రభుత్వం.. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను అడుక్కునేలా చేస్తున్నది. రైతులకు బేడీలు వేసి అవమానించిన ప్రభుత్వం.. ఇప్పుడు రైతులు మళ్లీ పైరవీకారులు, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది”అని హరీశ్‌‌‌‌ విమర్శించారు. పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారు.. దీనివల్ల పండ్ల తోటలు, ఆయిల్ పామ్, చెరుకు రైతులు నష్టపోతారన్నారు. కొండలు, గుట్టలున్న భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్తున్న ప్రభుత్వం.. కొండల్లో, గుట్టల్లో దళిత, గిరిజనులు సాగు చేస్తారన్న విషయం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. 

రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ ఎప్పుడు?

రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు అప్పు ఉన్న సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని హరీశ్‌‌‌‌ రావు అన్నారు. ఈ రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ 11 సార్లు రైతుబంధు ఇచ్చారని, రైతుల సమాచారం మొత్తం ఉన్నప్పటికీ మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే.. కోటి 4 లక్షల మంది కూలీలు ఉన్నారని చెప్పారు. మేలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.850 కోట్లు వచ్చాయని, 7 నెలలైనా ఉపాధి హామీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. 4వ కేబినెట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసిందన్నారు. ఒకే పంట పండించే రైతులకి రైతు భరోసా ఇవ్వకపోతే భవిష్యత్‌‌‌‌లో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.