![డంపింగ్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలి : మాజీ మంత్రి హరీశ్ రావు](https://static.v6velugu.com/uploads/2025/02/mla-harish-rao-has-expressed-support-for-locals-to-cancel-establishment-of-a-dumping-yard-in-gummadidala-mandal_gS0ZbsKFxj.jpg)
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న స్థానికులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర నాయకులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయకండని స్థానికులు విజ్ఞప్తి చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపామని గుర్తుచేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల భూములు గుంజుకున్నారని, న్యాల్కల్లో పచ్చటి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ శారు. ఈ విషయమై అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, రైతు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.