హైదరాబాద్, వెలుగు: దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి కాంగ్రెస్ ప్రభుత్వం బేడీలు వేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం హేయమైన చర్య అని గురువారం ట్వీట్ చేశారు. ఇంతకంటే దారుణం ఏముంటుందని అన్నారు. రైతు హీర్యా నాయక్ టెర్రరిస్టా? లేకుంటే దోపిడీ దొంగనా? అని ప్రశ్నించారు.
రైతుల భూములను గుంజుకుంటున్నారని, తిరగబడితే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టెర్రరిస్టులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది ప్రజాకంటక పాలన.. రైతు కంటక పాలన అని హరీశ్ మండిపడ్డారు.
అభివృద్ధిపై కాంగ్రెస్ దుష్ర్పచారం
సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను దివాలా తీయించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్న వారికి.. ఆర్‌బీఐ రిపోర్ట్ చెంపపెట్టు లాంటిదన్నారు. గురువారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నిజాలను అబద్ధాలుగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తుంటారని, కొంత ఆలస్యమైన నిజం బయటకు వచ్చి అందరి కళ్లు తెరిపిస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సంపదను సృష్టించడం, దాన్ని రెట్టింపు చేయడమెలాగో దేశానికే చెప్పింది తెలంగాణ రాష్ట్రమేనని, సీఎంగా కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024’నివేదికలోని గణాంకాలు చెప్తున్నాయన్నారు. తెలంగాణ పేద రాష్ట్రమని, రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంఘీభావం..
సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు హరీశ్ రావు మద్దతు తెలిపి, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, మర్చిపోయారని విమర్శించారు.