తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాజీ, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాజకీయ కక్ష్యతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 14 ఏళ్ల ఉద్యమంలో కూడా ఇలాంటి అణిచివేత చూడలేదన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం ముదురుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు నిర్భంగాన్ని ఆయన ఖండించారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో పరిస్థితులపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న గాంధీని ఎందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆయన. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగెలుపుతున్నారని చెప్పారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారు. గురువారం జరిగిన తోపులాటలో ఆయన భుజానికి గాయం అయ్యింది. డాక్టర్లు 15 రోజులపాటు ఫీజియో థెరపీ సూచించారని హరిష్ రావు తెలిపారు.
గతంలో పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని హరీష్ రావు చెప్పారు. ఈ దాడులు అన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలియే కారణమని.. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అని అర్థమౌతుందన్నారు. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు మాజీ మంత్రి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారాయన.