మైనార్టీలకు కాంగ్రెస్​ అన్యాయం చేసింది : మాజీ మంత్రి హరీశ్ రావు​ 

మైనార్టీలకు కాంగ్రెస్​ అన్యాయం చేసింది : మాజీ మంత్రి హరీశ్ రావు​ 

రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. శనివారం తెల్లాపూర్​మున్సిపాలిటీ పరిధిలో  బీఆర్ఎస్​ సీనియర్​ నేత​సోమిరెడ్డి, బీఆర్​ఎస్​ నేతలు, కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందులో హరీశ్​రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా ఇఫ్తార్​ విందును ఏర్పాటు చేస్తుండడాన్ని అభినందించారు.

 మైనార్టీల సంక్షేమానికి ఎన్నికల్లో రూ.4000 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్​పెద్దలు బడ్జెట్​లో రూ.3000 కోట్లు పెట్టారని  అందులో రూ.1000 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. ఖర్చు చేసిన కొద్ది పాటి రూపాయలు కూడా  కేసీఆర్ ఏర్పాటు చేసిన  మైనార్టీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారన్నారు. మైనార్టీ యువకులు, మహిళల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు.

ఇప్పటి వరకు  షాదీ ముబారక్, తులం బంగారం మాటే లేదన్నారు. కేబినెట్​లో ఒక మైనార్టీ మినిస్టర్ కు అవకాశం ఇవ్వలేదని, ఇటీవల ఎమ్మెల్సీలలో కూడా ముస్లింలకు చోటివ్వలేదన్నారు. తెల్లాపూర్​ మున్సిపాలిటీ అభివృద్ధికి కేసీఆర్​ రూ.75 కోట్లను ప్రకటిస్తే కాంగ్రెస్​ అందులో రూ.50 కోట్లను రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి, మాజీ  చైర్​పర్సన్ లలిత, నాయకులు ఆదర్శ్​రెడ్డి, మెట్టు కుమార్, సంతోష్​ రెడ్డి, గోవర్ధన్​రెడ్డి పాల్గొన్నారు.