- మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
మనోహరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను, మండలాలను రద్దు చేస్తాదట అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది.. కొత్త విద్యుత్ పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటా అని ఎద్దేవా చేశారు. గజ్వేల్ అభివృద్ధిని ఓర్వలేకనే గడాని రద్దు చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ అన్ని హామీలు ఇచ్చేదాకా ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. బట్ట కాల్చి మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరని, కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ ని కాంగ్రెస్ బద్నాం చేసిందని హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ పురం నవనీత, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, సర్పంచ్ రేఖ పాల్గొన్నారు.