మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్ కు నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. యాసంగి పంట సాగుకు సిద్ది పేట జిల్లా రైతాంగానికి రంగనాయక సాగర్ ద్వారా నీళ్లివ్వాలని కోరారు. గత మూడేళ్లుగా రంగనాయక్ సాగర్ ద్వారా జిల్లా ప్రజలకు పంట సాగుకు నీరందిస్తున్నాము... ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతుందన్నారు.
యాసంగి పంటలకు నీళ్లు అందించాలంటే రంగనాయక్ సాగర్ లో మూడు టీఎంసీలు నీరుండాలి..1.50 టీఎంసీలు నీరు మాత్రమే ఉందన్నారు హరీష్ రావు. రైతాంగం ప్రయెజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్ కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.