- ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తీరుపై అసహనం
- ప్రతి చిన్న విషయానికి కర్నూల్ బంగ్లాకు వెళ్లాల్సి వస్తోందంటున్న జనం
- అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషమట
- కోటి రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ వృథా
గద్వాల/అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డిని కలవాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాల్సిన నేతలు స్థానికంగా ఉండకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డిని ఏదైనా పని కోసం కలవాలంటే ఏపీలోని కర్నూల్ లో ఉన్న చల్లా బంగ్లాకు వెళ్లాల్సిందేనని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లను నిర్మించారు. వాటిని వృథాగా పెట్టేసి కర్నూల్ బంగ్లా నుంచి పాలన కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతి చిన్న విషయానికి కర్నూల్‌కు వెళ్లలేక చాలా మంది తమ సమస్యలు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషమట!
అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. 2019 అక్టోబర్ 3న అప్పటి ఎమ్మెల్యే అబ్రహం దానిని ప్రారంభించి, అక్కడే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల్లో విజయుడు ఎమ్మెల్యేగా గెలిచాక అక్కడ నిర్మించిన క్యాంప్ ఆఫీస్ కు వెళ్లకుండా మూసేశారు. ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తే వాస్తు దోషం ఉందని, అందువల్లే అబ్రహం ఓడిపోయాడని..
తాను అక్కడ ఉంటే ఇబ్బందులతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలవలేనంటూ సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ప్రజలకు సేవలందించేందుకు నిర్మించిన బిల్డింగ్ కు వాస్తు దోషమేమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రజలకు సేవలందిస్తే ఎమ్మెల్యే ఎక్కడ తన వర్గాన్ని తయారు చేసుకుంటాడోననే అనుమానంతో ఇక్కడికి రానీయడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
క్యాంప్ ఆఫీస్ వెలవెల..
గతంలో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లేవారు. కానీ, అందుకు భిన్నంగా ప్రస్తుత ఎమ్మెల్యే కర్నూల్ నుంచే పాలన కొనసాగిస్తుండడంతో.. అలంపూర్ చౌరస్తాలోని క్యాంప్ ఆఫీస్ వెలవెలబోతోంది. గతంలో ఎమ్మెల్యే అబ్రహం ఇక్కడి నుంచే పాలన సాగించేవారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంప్ ఆఫీస్‌లోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు.
దీంతో క్యాంప్ ఆఫీస్ ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. నియోజకవర్గంలోని ప్రజలు అత్యవసర పని ఉంటే.. కర్నూల్ లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. సీఎంఆర్ఎఫ్, తదితర పథకాలకు సంబంధించిన చెక్కులు తీసుకోవాలన్నా లబ్ధిదారులు కర్నూల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.