- గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన వార్డ్మెంబర్పై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ గుస్సా
- స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టిన పోలీసులు
- ఎమ్మెల్యేపై డీఎస్పీ ఆఫీసులో బాధితుడి ఫిర్యాదు
మెట్ పల్లి , వెలుగు: ‘ఏయ్... మాట్లాడకు ఇక.. ఏయ్ ఉండవయ్య ఉండు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దవడపళ్లు రాలుతయ్.. మజాక్ అనుకుంటున్నావా..ఓయ్ దిమాగ్ గిన ఖరాబయ్యిందా? తాగొచ్చినవా ఎందీ? ఏ కానిస్టేబుల్ వీన్ని తీస్కపోయి లోపలెయ్.. వార్డు మెంబర్ అయితే ఏంది? బుద్ధి వస్తది..వాని కడుపులో ఉన్న కల్లును బయటకు తీయించున్రి’ అని మెట్పల్లి మండలం కోనరావుపేట రెండో వార్డు మెంబర్ జవిడి సూర్య గంగారెడ్డిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోనరావుపేటలో బుధవారం ‘మన ఊరు మన బడి’ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ చేయడానికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వచ్చారు. సమావేశంలో మాట్లాడుతుండగా రెండో వార్డు మెంబర్ జవిడి సూర్య గంగారెడ్డి స్టేజీ వద్దకు వచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గ్రామంలో ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించాడు. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదని అడిగాడు. ప్రజా అవసరాలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు హయాంలో ఏడెకరాలు కేటాయించారని..నాలుగు సార్లు గెలిచి పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం అయినా కట్టించావా అని ప్రశ్నించాడు. గంగారెడ్డి ప్రశ్నలకు కోపం తెచ్చుకున్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అతడిపై ఫైర్ అయ్యారు. ‘మంచి పని కోసం వస్తే తాగి మాట్లాడుతున్నావా.. మూతిపళ్లు రాలుతయ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీన్ని తీసుకెళ్లి లోపలేయున్రి’ అని పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు గంగారెడ్డిని మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి రెండు గంటలు కూర్చోబెట్టి తర్వాత వదిలిపెట్టారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే తనను అసభ్య పదజాలంతో దూషించాడని బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని గురువారం డీఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ నిరసన
గంగారెడ్డిపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మంచి బుద్ది ప్రసాదించాలని విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం, బ్లాక్ అధ్యక్షుడు అల్లూరు మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, గోరుమంతల ప్రవీణ్ , దుర్గం శేఖర్, మారు గంగారెడ్డి, శివా, నారాయణ, రాజేందర్, అనంతరెడ్డి, ఇంద్రల రవి, జి శ్రీకాంత్, బాలయ్య, గంగారం, శంకర్, నరసయ్య, అబ్దుల్ జబ్బార్, ముఖీం పాల్గొన్నారు.