కాంగ్రెస్​ ఎక్కువ రోజులుండదు : జగదీశ్​రెడ్డి

  • వాళ్లే అవకాశాలు ఇస్తరు..మనం అందిపుచ్చుకోవాలె
  • ఇంకా 900 రోజులైనా హామీలు అమలు చేసుడు వాళ్లతోని కాదు 
  • ప్రజలు ప్రశ్నించే దాకా వేచి ఉండాలె 

సూర్యాపేట , వెలుగు : కాంగ్రెస్​అధికారంలో ఎక్కువ రోజులు ఉండదని, అవకాశాలు వాళ్లే ఇస్తారని, మనం అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ​నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని, తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని, ఇప్పుడు పాత పద్ధతిలో వేస్తామని అంటున్నారన్నారు.

డిసెంబర్ 9న రుణమాఫీ కూడా చేస్తామన్నారని, అవసరమైతే కొత్త రుణాలు తీసుకునేది లేదన్నారని, అది కూడా అమలు కాలేదన్నారు. క్వింటాల్ ​ధాన్యానికి బోనస్​ఇచ్చి కొంటామని చెప్పారని, దాని ఊసు కూడా లేదన్నారు. ఇంకా 900 రోజులు గడిచినా వారి హామీలు అమలు కావన్నారు. ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలయ్యే వరకు ఓపికగా ఉండాలన్నారు. వారే మనకు అవకాశం ఇస్తారని,  దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.  గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 6 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే, తాము18  మెగావాట్లు ఉత్పత్తి చేశామని, అప్పుడు జెన్​కో ఆస్తులు రూ.18 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.50 వేల కోట్లు అయ్యాయన్నారు.

ఇప్పుడు ఆరు గంటల కరెంటు ఇస్తే తాము  24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. ఏ పని చేసేందుకైనా దమ్ము, ధైర్యం ఉండాలన్నారు. సాకులు చెప్తే నడవదని, అసెంబ్లీలో వాళ్లు చర్చ పెట్టడం కాదని, తానే పెడతానన్నారు. ఎందుకు ఓడిపోయామని బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలని, తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. సూర్యాపేట మెయిన్​రోడ్డుపై యాక్సిడెంట్లు జరుగుతున్నాయని డివైడర్ కట్టించామని, ఇప్పుడు దాన్ని తొలగించి ప్రమాదాలకు కారకులు కాబోతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని, తర్వాత మాట్లాడుదామన్నారు.