బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయి : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట/తుంగతుర్తి/కోదాడ, వెలుగు : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి హామీలను విస్మరించిందన్నారు. తెలంగాణలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

నల్లగొండ గడ్డ.. పట్టభద్రుల అడ్డ-: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా పట్టభద్రుల అడ్డ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కాలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వేశారా అంటూ ప్రశ్నించారు.  కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ద్వారా వచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఉపయోగిస్తానని తెలిపారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.