సూర్యాపేట ,వెలుగు : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూర్యాపేట మున్సిపాలిటీ, రూరల్ మండలంలో 166 మంది, చివ్వేంల మండలంలో 92 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
హామీలను అమలు చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటుంది తప్ప.. చేసిందేమీలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు కురిసి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గోదావరి ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు అందించాలని కోరారు.