సూర్యాపేట: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులను తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.
అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎదురుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు.. పోలీసులు వారి పరిధి దాటి అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇలానే వ్యవహరిస్తే చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అక్రమ ఇసుక, మట్టి వ్యవహారాల వెనుక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. అక్రమ రవణాలు మొత్తాన్ని నిలిపివేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వ్యాపార రంగాల వ్యక్తులను అధికార పార్టీ నేతలే బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఏదైనా చేయొచ్చు అంటూ.. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.