మునుగోడులో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలవకూడదని కుట్ర చేస్తున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి కోణం ఉందన్నారు. టీఆర్ఎస్ వంద, బీజేపీ వంద కోట్లు రెడీ చేసుకున్నాయన్నారు. మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అవి ప్రజల సొమ్మేనన్నారు. డబ్బుల ద్వారా ఓట్లు రావనే మెసేజ్ను మునుగోడు ప్రజలు ఈ ఉపఎన్నికతో ఇవ్వాలన్నారు.
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. భవనం వెంకట్రాం, విజయ భాస్కర్ రెడ్డిల క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పాల్వాయి పనిచేశారని జగ్గారెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానమే నిర్ణయించిందన్న జగ్గారెడ్డి... తాను కూడా ప్రచారంలో పాల్లొంటానని తెలిపారు.
మునుగోడు ఎన్నికల ప్రచారానికి ఎవరు రాకున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు జగ్గారెడ్డి. తన తమ్ముడు ఎన్నికల్లో పోటీలో ఉండటంతో తాను ప్రచారానికి వెళ్లలేనని వెంకట్ రెడ్డి పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారని, దానికి అధిష్టానం కూడా ఆమోదం తెలిపిందన్నారు. అటు చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల హస్తం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు.