కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడప్పుడే రాజీనామా చేయనని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో తనకు అవమానాలు జరిగాయని ఇటీవలే ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.... తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి పార్టీకి కొంత గడువు విధిస్తున్నట్లుగా కూడా జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే నిన్న(గురువారం) సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన జగ్గారెడ్డి రాజీనామాపై వెనక్కు తగ్గినట్టుగా కనిపించారు.
అయితే ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ముఖ్య అనుచరులతో ఇవాళ (శుక్రవారం) జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. మెజార్టీ మంది నేతలు.. కాంగ్రెస్‌లోనే కొనసాగాలంటూ జగ్గారెడ్డికి సూచించారు. మరికొందరైతే కాంగ్రెస్‌లో ఉంటేనే తాము మీ వెంట ఉంటామంటూ తేల్చి చెప్పారట.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. అంతేకాకుండా తాను టీఆర్ఎస్‌లోనో, బీజేపీలోనో చేరేది లేదని కూడా తేల్చిచెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను త్వరలోనే కలుస్తానని, వారితో మాట్లాడిన తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..