నల్గొండ, వెలుగు: ‘కాంగ్రెస్ కార్యకర్తలపైన ఎవరైనా చేయి వేస్తే చేయి నరికేస్తా... కాళ్లు వేస్తే కాళ్లు తీసేస్తా’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్రవంతి నామినేషన్‌కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని, ఈ ఎన్నికల్లో స్రవంతిని గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
ఒక చరిత్ర ఉన్న కాంగ్రెస్ కుటుంబం నుంచి స్రవంతి బరిలో దిగారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్ఎస్బతుకులు రోడ్ల పాలయ్యేవని, ఈ రోజు ఆ పార్టీ లీడర్లు తింటున్న తిండి..అధికారం అంతా సోనియాగాంధీ పెట్టిన భిక్షేనని అన్నారు. జగదీష్ రెడ్డి లాంటి మంత్రులను కాంగ్రెస్‌లో ఎంతోమందిని చూశామని, అలాంటి వాళ్ల ఆటలు మునుగోడులో సాగవని హెచ్చరించారు.