లంబాడీలకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

లంబాడీలకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి, వెలుగు: కాయితీ లంబాడీలను ఎస్టీల్లో చేర్చాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ప్రస్తావించగా, దీనిపై గిరిజనుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం బంజారా భవన్​లో సమావేశమైన గిరిజనులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో డిపాజిట్​ చేయడానికి కూడా డబ్బులు లేకుంటే, చందాలు వేసి మరి కాంగ్రెస్ ​నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అభివృద్ధి పేరుతో పార్టీ మారి ఇప్పుడు తమకే వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాజల సురేందర్ నిరసన వ్యక్తం చేస్తున్న వారి దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరారు. అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు తెలపాలని నినాదాలు చేస్తూ ఎస్టీలు తమ నిరసన విరమించారు. జిల్లా బంజారా జాక్  కన్వీనర్ మోచీరాం, ప్రకాశ్, ప్రకాశ్​నాయక్, అనిల్ నాయక్, ఓంకార్, పవార్ సంతోష్, లింబాద్రి పాల్గొన్నారు.