- హైకోర్టు తీర్పుతో బీసీలకు న్యాయం
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కులగణనపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, పిటిషనర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత బీసీల పక్షాన న్యాయం, ధర్మం ఉందని గ్రహించి కులగణన నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని తీర్పు ఇవ్వడంపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కులగణన చేపట్టాలని న్యాయ పోరాటం చేశామన్నారు. హైకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున వాదించిన అడ్వొకేట్లకు ఈ సందర్భంగా జాజుల ధన్యవాదాలు తెలిపారు.