ఉదండాపూర్  నిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్  నిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  • గత ప్రభుత్వం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా
  • జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: ఉదండాపూర్  నిర్వాసితులకు తాను అండగా ఉంటానని, అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేనైనా బాధితులతో కలిసి పోరాటం చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని జలమండలి ఆఫీస్​లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ఉదండాపూర్  నిర్వాసితుల సమస్యను మంత్రికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలు, వారికి పునరావాస సాయం పెంచాలని తాను ఎమ్మెల్యే కాక ముందు నుంచి పోరాడుతున్నానని తెలిపారు. ఎమ్మెల్యే అయ్యాక  మొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ సమస్య గురించే మాట్లాడానని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు ఉదండాపూర్​ గుండె వంటిదని,  ఇది పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు.

పాలమూరు ప్రాజెక్టులో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది ఉదండాపూర్, వల్లూరు గ్రామస్తులేననే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం  ఉదండాపూర్  నిర్వాసితుల సమస్యను పట్టించుకొని ఉంటే ఎప్పుడో పరిష్కారమయ్యేదని తెలిపారు. ఇప్పుడు తాను శిక్ష అనుభవించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

పరిహారం పెంచేందుకు నిధులు లేవంటే తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఉదండాపూర్, వల్లూరుతో పాటు మిగిలిన 7 తండావాసుల తరపున పోరాడుతానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరపున తాను పోరాటం చేస్తుండడంతో, రాజకీయ లబ్ధి కోసం కొంత మంది వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.