జడ్చర్లటౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో రూ.47 కోట్లతో చేపట్టిన అమృత్ పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంలో సాంకేతిక సమస్యలతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందనితెలిపారు. మిషన్ భగీరథ పథకంలో మోటార్లు మార్చేందుకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు.
జడ్చర్లలో రూ.47 కోట్లతో అమలు చేస్తున్న అమృత్ పథకంలో రూ.20 కోట్లు కేంద్రం ఇస్తే, మిగిలిన రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 56 కిలోమీటర్ల పైప్ లైన్లను ఏర్పాటు చేస్తారని, ఎర్రగుట్ట, నిమ్మబావిగడ్డ, సిగ్నల్ గడ్డ, క్లబ్ రోడ్, బ్రహ్మంగారి గుడి, జాతీయ రహదారి సమీపంలో 5 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులను నిర్మిస్తారని తెలిపారు. దీంతో జడ్చర్లలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ ఇన్చార్జి చైర్పర్సన్ సారిక రామ్మోహన్, పబ్లిక్ హెల్త్ డీఈ మల్లేశ్ పాల్గొన్నారు.