ఏడాదిలో అభివృద్ధి చేయకుంటే నిలదీయండి

ఏడాదిలో అభివృద్ధి చేయకుంటే నిలదీయండి
  • మహ్మద్ నగర్ ను దత్తత తీసుకుని మోడల్ విలేజ్ గా చేస్తా.. 
  • అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ హామీ 

చండ్రుగొండ,వెలుగు:  మహ్మద్ నగర్ ను జిల్లాలోనే మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయితీ శివారు మహ్మద్ నగర్ లో గ్రామస్తులతో  రచ్చబండ నిర్వహించారు. గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. వివిధ శాఖల ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సెగ్మెంట్ లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని అన్ని మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు.

అభివృద్ధికి ఆఫీసర్లు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఏడాదిలోపు అభివృద్ధి చేస్తానని.. లేకుంటే పర్యటనకు వచ్చినప్పుడు తనను నిలదీయాలని పేర్కొన్నారు. అనంతరం సమస్యలను ఆఫీసర్ల ముందు చెప్పాలని  గ్రామస్తులను కోరారు. తాగునీటి ప్లాంట్ కావాలని , కరెంట్ కోతలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, బస్సు సౌకర్యం, విద్య, వైద్యం, అంగన్ వాడీ సెంటర్ కు పక్కా భవనం, 800 మంది జనాభా కలిగి ఉండగా.. ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.  గ్రామస్తులు చెప్పిన సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు దృష్టి సారించాలని, తన సాయం  ఏదైనా ఉంటే చెప్పాలని సూచించారు.  మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో అశోక్, పలు శాఖల ఆఫీసర్లు, కాంగ్రెస్ నేతలు భోజ్యానాయక్, రమణ, ఏడుకొండలు, సురేశ్, రామారావు పాల్గొన్నారు.