‘మీ ఎమ్మెల్యే.. మీ ఊరిలో..’ కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శ్రీకారం

‘మీ ఎమ్మెల్యే.. మీ ఊరిలో..’ కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శ్రీకారం
  • చెన్నాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్తులతో రచ్చబండ 
  • సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ‘మీ ఎమ్మెల్యే.. మీ ఊరిలో’ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. తన సెగ్మెంట్ లోని చెన్నాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముందుగా గ్రామస్తులతో  రచ్చబండ నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను పిలిచి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని వారి సమక్షంలోనే ఆదేశించారు.

గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.  అదేవిధంగా  సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఒక డాక్యుమెంటరీ రూపొందించి తనకు అందజేస్తే ప్రభుత్వానికి నివేదించి  పరిష్కారం చూపేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.  ఇకనుంచి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తానన్నారు. అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

వాగులు, వంకలు దాటుకుంటూ..

రోడ్డు కూడా సరిగా లేని మారుమూల గిరిజన గ్రామమైన చెన్నాపురానికి వాగులు, వంకలు దాటుకుంటూ బైక్ పై 5 కిలోమీటర్లు ప్రయాణించి ఎమ్మెల్యే చేరుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చెన్నాపురంలో గొత్తి కోయలు ఉండటం, ఇటీవల కరకగూడెంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ జరగటం వంటి ఘటన తర్వాత ఎమ్మెల్యే పర్యటన పోలీసులను టెన్షన్ కు పెట్టించింది.  కార్యక్రమం అయ్యేంత వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.