పని చేయని ఎమ్మెల్యే ఊళ్లోకి రావద్దంటూ ఫ్లెక్సీ

నందిపేట, వెలుగు: ఎమ్మెల్యే జీవన్​రెడ్డి గో బ్యాక్​అంటూ నందిపేట మండలం కుద్వాన్​పూర్​లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కుద్వాన్​పూర్​ గ్రామానికి ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నాడని తెలుసుకున్న కొందరు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం రాత్రి గ్రామ పంచాయతీ పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎమ్మెల్యే, గ్రామానికి ఎలా వస్తున్నారంటూ  ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్​ లీడర్లు తెల్లవారకముందే దాన్ని తొలగించారు. అప్పటికే ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరలయింది. బీఆర్ఎస్​ లీడర్లు ఫ్లెక్సీ తొలగించిన గంటలోనే యువకులు మళ్లీ ఏర్పాటు చేశారు. వీడీసీ సభ్యులు కలగజేసుకొని రాజకీయంగా ఏదైనా ఉంటే మీది మీరే చూసుకోవాలంటూ బీఆర్ఎస్ లీడర్లతో కలిసి​ఫ్లెక్సీని తొలగించారు.

తర్వాత గ్రామానికి వచ్చిన జీవన్​రెడ్డి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ప్రజలను పలకరించారు. అంతలోనే ఎన్నికల కోడ్​అమల్లోకి రావడంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయకుండానే వెళ్లిపోయారు.