రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ లీడర్లు
వర్ని, వెలుగు: ఉమ్మడి వర్ని మండల మాజీ ఎంపీపీ సంగెం శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని కలిశారు. గురువారం హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. నియోజకవర్గంలో పార్టీని బల పేతం చేయాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. కార్యక్రమంలో శేశుగారి భూంరెడ్డి తదితరులు ఉన్నారు.
హాస్పిటల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : నమస్తే నవనాథపురం కార్యక్రమంలో ఆర్మూర్ వంద పడకల హాస్పిటల్‌ను పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావుతో ఫోన్ మాట్లాడారు. హాస్పిటల్‌కు మంజూరైన డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయించాలని, ఖాళీగా ఉన్న 35 మంది సిబ్బంది, 15 మంది డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని మంత్రిని కోరారు. నవంబర్‌లో 310 డెలివరీలు చేసిన హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. అలాగే ఆర్మూర్ మోడ్రన్ దోభీఘాట్, గుండ్ల చెరువు టూరిజం అభివృద్ధి, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరు కోసం మంత్రి కేటీఆర్, కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగరాజు, డాక్టర్లు అమృత్‌రెడ్డి, స్రవంతి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్ వేణుగౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ టౌన్‌లోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్‌నెన్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయాలి
నిజామాబాద్/లింగంపేట, వెలుగు: లిక్కర్ స్కామ్ ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ సందగిరి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అవినీతి చేసిన ఎవరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం కార్యదర్శి ఎర్రం సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, మందుల బాలు, ఉపాధ్యక్షులు నాగ సురేశ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో జరిగిన నిరసనలో బీజేవైఎం, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, హన్మాండ్లు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంపల వెంకన్న పాల్గొన్నారు.
ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి
కామారెడ్డి, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ 2016 కంటే ముందు ఆధార్ గుర్తింపు కార్డు పొందిన వారు యూఐడీఏఐ ఆదేశాల ప్రకారం కార్డును అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు. ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మెనేజర్ చిందం రమేశ్, ఆధార్ ప్రాజెక్ట్ మెనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీఎం ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.